ఇక టీడీపీ జాతీయ ఆశలు గల్లంతు… తెలంగాణలో పడిపోయిన ఓటింగ్

జాతీయ పార్టీగా అవతరించాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఇటీవలి తెలంగాణ ఎన్నికలు భారీ షాక్ నే ఇచ్చాయి. 13 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 2 స్థానాలు మాత్రమే విజయం సాధించింది. ఆ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లోనూ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, సత్తుపల్లి మినహా ఎక్కడా టీడీపీ గెలవలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయడు ప్రచారం చేసిన స్థానాల్లోనూ టీడీపీ ఓటమి పాలయ్యింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. త్వరలోనే పంచాయితీ, పార్లమెంటు ఎన్నికలు సైతం జరగనున్నందున ఆ పార్టీ బలోపేతానికి ఏమైనా ప్రయత్నిస్తుందా లేకపోతే తెలంగాణను వదిలేస్తుందా అని పార్టీ క్యాడరే అయోమయంలో ఉంది.2014 ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో బలాన్ని చాటుకుంది. ముఖ్యంగా సెటిలర్లు ప్రభావం చూపే హైదరాబాద్ లోని పలు స్థానాల్లో భారీ మెజారిటీలతో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

గత ఎన్నికల్లో మొత్తం 15 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే, తర్వాత సీన్ రివర్స్ అయ్యింది ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా వారంతా పార్టీ మారారు. జిల్లాల్లోనూ ద్వితీయ శ్రేణి నాయకులంతా ఇతర పార్టీల్లో చేరిపోవడంతో చాలా నియోజకవర్గాల్లో కనీస క్యాడర్ కూడా లేకుండా పోయింది. ఇది గుర్తించిన పార్టీ హైకమాండ్ ఇటీవలి ఎన్నికల్లో పొత్తుల ద్వారా ఎన్నికలకు వెళ్లగా ఆ ప్రయోగం కాస్తా వికటించింది. గత ఎన్నికల్లో గెలిచిన 15 స్థానాల్లోనూ పోటీ చేయకుండా కేవలం 13 స్థానాల్లో పోటీచేసి 2 మాత్రమే గెలిచింది. సెటిలర్ల ప్రభావంతో గెలుస్తామనుకున్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్ వంటి స్థానాల్లోనూ ఓడిపోయింది. టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చాలానే ప్రయత్నం చేసింది. ఏపీ నుంచి పార్టీ నేతలను టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. త్వరలోనే గ్రామ పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి.

అసలు ఈ ఎన్నికలకు కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా ఉండదా అనేది క్యాడర్ కు అర్థం కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో ఎటువంటి సమీక్ష కూడా జరగ లేదు. గ్రామాల్లో ఆ పార్టీ క్యాడర్ ను కోల్పోవడంతో ఖమ్మం జిల్లాతో పాటు బలమైన నాయకులు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ ప్రభావం ఉంటుంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది కూడా అనుమానమే. టీడీపీతో పొత్తు వల్లే నష్టపోయామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు భావిస్తున్నారు. వీరి టీడీపీతో పొత్తుకు ఇష్టపడటం లేదు. అయితే, అధిష్ఠానం టీడీపీతో పొత్తు ఉండాల్సిందే అంటే మాత్రం ఒప్పుకుంటారు.టీడీపీకి ఎంపీ స్థానాలు ఎన్ని వదులుతారనేది చెప్పలేం. టీడీపీ కూడా ఖమ్మం, మల్కాజిగిరి స్థానాలు మాత్రమే అడిగే అవకాశం ఉంది. అవి కూడా కాంగ్రెస్ వదులకునే అవకాశం లేదు. ఇక, తెలంగాణ టీడీపీ నేతలు కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం కూడా మర్చిపోయి చాలా కాలమే అయ్యింది. పేరున్న నాయకులు సైతం నామమాత్రంగా తయారయ్యారు. ఇక, ఈ ఎన్నికల ఫలితాల తర్వాత వారు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దీంతో ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రభావం కోల్పోయినట్లయ్యింది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆ పార్టీ ఇక్కడి నుంచి పూర్తిగా మాయం కావడం ఖాయమని అంటున్నారు.

Tags: tdp, chandra babu naidu, national party,bjp, maha kutami

Related posts

Leave a Comment