ఇండియాకు ఇమ్రాన్ స్నేహ హస్తం.. 27 మంది భారతీయుల విడుదల!

  • భారత్ తో సత్సంబంధాలను కోరుకుంటున్నానన్న సంకేతాలు
  • ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే విడుదల
  • వాఘా బార్డర్ వద్ద భారత్ కు అప్పగించనున్న పాక్

తాను భారత్ తో సత్సంబంధాలనే కోరుకుంటున్నానన్న సంకేతాలను ప్రపంచానికి తెలిపేలా పాకిస్తాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న 27 మంది భారతీయులను విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు. తన ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజునే వారిని ఇండియాకు అప్పగించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇమ్రాన్ ఆదేశించారు. ఈ విషయమై భారత అధికారులకు సమాచారం కూడా అందింది.

వీరంతా గుజరాత్ కు చెందిన మత్స్యకారులుగా తెలుస్తోంది. వేటకు వెళ్లిన వీరు, పాక్ జలాల్లోకి ప్రవేశించడంతో, పాక్ సైన్యం వీరిని అదుపులోకి తీసుకుని కరాచీ జైలుకు తరలించింది. ఆపై వీరిని లాహోర్ జైలుకు మార్చింది. వీరంతా దాదాపు రెండేళ్లుగా జైళ్లలో ఉన్నారు. ఇమ్రాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు వీరిని వాఘా సరిహద్దుల వద్ద భారత అధికారులకు అప్పగిస్తామని పాకిస్తాన్ పేర్కొంది. లాహోర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వాఘా వరకూ వీరిని తీసుకు వస్తామని అధికారులు తెలిపారు.

Related posts

Leave a Comment