ఆ తాఖీదుపై సంతకం చేయలేదు : ప్రకాశ్‌రాజ్‌

కేరళ: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌కు తాను వ్యతిరేకిని కానని అంటున్నారు విలక్షణ నటుడు ప్రకాశ్‌. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ‌(ఏఎంఏఎంఏ-అమ్మ) అధ్యక్షుడైన మోహన్‌లాల్‌ అసోసియేషన్‌ సభ్యుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒక నటి విషయంలో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదుర్కొని, జైలు పాలైన నటుడు దిలీప్‌ను మళ్లీ చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానించడమే కాకుండా, ఆయన సభ్యత్వాన్ని మోహన్‌లాల్‌ పునరుద్ధరించారు. ఆయన అలా చేయడం సరికాదని… ఈ విషయంలో మోహన్‌లాల్‌ కనీసం తమను సంప్రదించలేదని అసోసియేషన్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దాంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి మోహన్‌లాల్‌ను ఆహ్వానించవద్దంటూ జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు బిజూకుమార్‌ దామోదరన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖకు వందకు పైగా నటులు తమ మద్దతు తెలుపుతున్నారని బిజు తెలిపారు. వారిలో నటుడు ప్రకాశ్‌రాజ్‌, మాధవన్‌, గీతామోహన్‌ దాస్‌, శ్రుతి హరిహరన్‌ తదితరులు ఉన్నారని వెల్లడించారు.

ఈ విషయమై తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ ట్విటర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. మోహన్‌లాల్‌ను వ్యతిరేకిస్తూ తాను ఎలాంటి తాఖీదుపై సంతకం చేయలేదని తెలిపారు. ‘మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా తాఖీదుపై సంతకం చేశానని వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. దిలీప్‌ విషయంలో ‘అమ్మ’ తీసుకున్న నిర్ణయంపై నాకు విభేదాలు ఉన్నాయి. కానీ మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా సీఎంకు రాసిన లేఖపై సంతకం చేశానన్నది మాత్రం అబద్ధం’ అని వెల్లడించారు ప్రకాశ్‌ రాజ్‌.

ప్రకాశ్‌ రాజ్‌ మాత్రమే కాదు… ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ తుండియిల్‌ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. బిజు రాసిన లేఖపై తాను కూడా సంతకం చేయలేదని చెప్పారు. ‘మోహన్‌లాల్‌ను కార్యక్రమానికి ఆహ్వానించకూడదన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? ఇదెంత మూర్ఖంగా ఉందో ఆలోచించారా? నేను మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి తాఖీదుపై సంతకం చేయలేదు. కేరళ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోందని నాకు వాట్సాప్‌లో మెసేజ్‌ వచ్చింది. ఇందుకు నేను వస్తానని చెప్పాను. కానీ అందులో మోహన్‌లాల్‌ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఒకవేళ మోహన్‌లాల్‌ను కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు అని చెప్పి ఉంటే నేను కూడా రానని చెప్పేవాడిని’ అని వెల్లడించారు సంతోష్‌.

Related posts

Leave a Comment