ఆస్తంతా కరిగించి..ఆపన్నులను నడిపించి

పాతికేళ్ల క్రితం మాట… బీటెక్‌ చదివితే చాలు బంగారం లాంటి భవిష్యత్తు, అమెరికాకు రెక్కలు కట్టుకుపోయే అవకాశం కాళ్ల ముందు..అలాంటిది.. అతనికి చేతిలో బీటెక్‌పట్టానే కాదు, వెనకాల 160 ఎకరాల ఆస్తీ ఉంది. అందుకే అందరిలానే కంప్యూటర్‌ సైన్స్‌ చదివి, విదేశాల్లో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం గురించి చాలా కలలు కన్నాడు. స్నేహితులంతా ఒకరి తర్వాత ఒకరు అమెరికా బాట పట్టేస్తుంటే నేను కూడా వస్తున్నా.. కొద్దిరోజుల్లోనే అనేవాడు. మరి ఏం జరిగింది…???

ప్రస్తుతం ఓ మారుమూల పల్లెటూరు. మాసిన గడ్డంతో.. ఆధ్యాత్మిక చింతనతో.. సేవా భావంతో.. వికలాంగులకు సేవ చేసే వ్యక్తి జగదీష్‌బాబు. శ్రీగురుదేవ ట్రస్ట్‌ పేరుతో ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ అవయవాలు అమరుస్తూ మానవసేవలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లోని 25,000 కుటుంబాల్లో వెలుగులు నింపారు. జగదీష్‌బాబుది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం. అసలు అమెరికాకి వెళ్లిపోవాలనుకున్న అతను అవయవ దానకర్ణుడిగా ఎలా మారిపోయాడు, అతని జీవితం ఇలాంటి మలుపెందుకు తిరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు ఆయన మాటల్లోనే…

‘జీవితం మన చేతుల్లో ఉన్నట్టే ఉంటుంది.. కాని ఉండదు. ఇదే నిజం.. జీవితంలో వూహించని మలుపుల్ని దాటక తప్పదు. మాది జమిందారీ వంశం. మా తాతల కాలం నాటికి సుమారుగా 160 ఎకరాల భూముండేది. అమ్మా, నాన్నలిద్దరికీ దైవభక్తి ఎక్కువ. దాంతో ఇంట్లో ఎప్పుడూ ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. ఆ వాతావరణం నుంచి బయటపడటానికేమో…. బాగా చదువుకోవాలి, అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించాలనుకునేవాడిని. బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటరు సైన్స్‌లో ఇంజినీరింగు పట్టా పుచ్చుకున్నా. వీసా కూడా సిద్ధం అయ్యింది. అలాంటి సమయంలో నాకో ఫోన్‌ కాల్‌. ఏటా పుణ్యక్షేత్రాలకు వెళ్లివచ్చే నాన్నగారు తిరిగి రాలేదనేది దాని సారాంశం. అదే సమయంలో అమ్మకు క్యాన్సర్‌. ఎంత పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లినా ఆమె బతకడం కష్టమనేవారు. లక్షల్లో ఖర్చు. స్థిరాస్తులున్నా… చేతిలో అంత డబ్బుండేది కాదు. తెలిసినవారు మొదట్లో స్పందించినా తర్వాతర్వాత ఎవరూ పలకరించేవారే కాదు. అమ్మమాత్రం ‘‘నాన్నా.. బాధపడకు.. బాగున్నప్పుడు అందరూ పక్కనుంటార్రా. కష్టాల్లో ఉన్నప్పుడు వెంట ఉన్నవాళ్లే నిజమైన ఆత్మీయులు’’ అంది. మొత్తానికి అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. క్యాన్సర్‌ని జయించింది. కానీ అమ్మ మాటల్లో అసలు అర్థం అప్పుడే తెలిసింది. ఇంత ఆస్తి ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే పేదరికంలో ఉండేవారికి కష్టాలొస్తే ఎవరు ఆదుకుంటున్నారన్న ప్రశ్న నాలో నాటుకుపోయింది. దాంతో అమెరికాని పక్కన పెట్టేశాను. పేదవారి కోసం ఆలోచించడం మొదలుపెట్టాను.

ఏకధాటిగా ఏడ్చిన తరుణం…
స్వామి సుఖబోధానంద సూచనలతో సేవకి నాంది పలికారు జగదీష్‌. వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో పాఠశాలలు, కళాశాలలు, సేవా సంస్థలకు ఆర్థిక సాయం అందించడం మొదలుపెట్టారు. అదే సమయంలో జగదీష్‌బాబు స్నేహితుడు రాజశేఖర్‌ రహదారి ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్నారు. అతనికి జైపూర్‌ తీసుకెళ్లి కృత్రిమ కాలు వేయించాలనుకున్నా వీలవ్వలేదు. రాజశేఖర్‌ జైపూర్‌ సొంతంగా వెళ్లే ప్రయత్నంలో రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయారు. అది జగదీష్‌బాబుని కలచివేసింది. ఎక్కడ వికలాంగులు కనిపించినా తన స్నేహితుడే గుర్తొచ్చి ఏడ్చేసేవారు. అదే సమయంలో ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోతున్న వికలాంగులు పడే అవస్థలేంటో తెలుసుకున్నారు. కృత్రిమ కాలో, చెయ్యో అమర్చుకోవాలనుకున్నా దానికయ్యే వ్యయం భరించలేక వేలాది మంది అలాగే ఉండిపోతున్నారని తెలుసుకున్నారు. పైగా ఎక్కడో హైదరాబాద్‌, కటక్‌(ఒడిశా), జైపూర్‌(రాజస్థాన్‌)ల్లో మాత్రమే కృత్రిమ అవయవాలు అమర్చే కేంద్రాలుండడంతో అక్కడి వరకూ వెళ్లలేక వికలాంగులు పడే కష్టాలు చూసి తాను సేవ చేయాల్సింది వారికేనని నిర్ణయించుకున్నారు.

ఆఖరికి మిగిలేది ఆరడుగుల నేలేగా ‘

దేశం వదిలిపోవాలనుకున్న నేను ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నానంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నా ప్రయాణంలో అన్నిటికంటే ముఖ్యమైంది అమ్మ చెప్పిన మాటలు. ఎకరాలకు ఎకరాలు అమ్మేసినా ఆమె ఏమీ అనలేదు. సేవా కార్యక్రమాలకే కదా చేస్తున్నావు మంచిదే అని ప్రోత్సహించింది. ఎంత దాచాలని ప్రయత్నించినా చివరికి మిగిలేది ఆరడుగుల నేలేగా’..

– రాపర్తి జగదీష్‌బాబు, వ్యవస్థాపకుడు, శ్రీగురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌
మిత్రుడి మరణంతో మరో కుదుపు…

మొదట్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వికలాంగులకి మనోధైర్యాన్నిచ్చి దగ్గరుండి హైదరాబాద్‌ తీసుకెళ్లి కృత్రిమ అవయవాలు వేయించేవారు. ఆ క్రమంలోనే అక్కడ పనిచేసే నళినేష్‌బాబు అనే కృత్రిమ అవయవాలు అమర్చే ఉద్యోగితో పరిచయమైంది. ఆయన కూడా వికలాంగుడే. కానీ కృత్రిమ అవయవాల తయారీలో రాష్ట్రపతి అవార్డు అందుకొన్న గొప్పవ్యక్తి. ఆయన చొరవతోనే మంగళపాలెంలో క్యాంపులు పెట్టి హైదరాబాద్‌లో అవయవాలు తయారుచేసి తెచ్చి బిగించడం మొదలుపెట్టారు. 2004లో నళినేష్‌బాబు సూచనతో అదే వూర్లో ఒక అవయవ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. అలా శ్రీ గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌కి శ్రీకారం చుట్టారు. సేవలు విస్తరిస్తున్న సమయంలో నళినేష్‌బాబు గుండెపోటుతో చనిపోయారు. గిట్టనివారు ‘ఇంకేముంది అవయవాలు తయారుచేసేవాడే లేడు.. ఇక ట్రస్టు మూసేస్తారు’…అన్న మాటలు బాణాల్లా విసిరారు. అయినా సరే.. వికలాంగులకు అందించే సేవలు కొనసాగించి తీరాలన్న సంకల్పంతో మరో టెక్నీషియన్‌ని నియమించుకుని స్వయంగా అవయవ తయారీని తిరిగి ప్రారంభించారు జగదీష్‌. ఆ సమయంలో ప్రస్తుత సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కె.వి.చౌదరి ఓ సారి సంస్థను సందర్శించి జగదీష్‌ చేస్తున్న సేవకు ముగ్ధులై వెన్నుదన్నుగా నిలబడ్డారు. అక్కడి నుంచి ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలు సైతం తమ వంతు సహకారం అందించడం మొదలెట్టాయి.

వేలమందికి వూతకర్ర….

శ్రీగురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఒక్క ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకే పరిమితం కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల్లో సైతం క్యాంపులు నిర్వహించి కృత్రిమ అవయవదానం చేస్తోంది. ఇప్పటికి దేశవ్యాప్తంగా పాతికవేలమది వికలాంగులకు కాళ్లు, చేతులు, బ్లైండ్‌ స్టిక్స్‌, మూడు చక్రాల సైకిళ్లు, పోలియో కాలిపర్స్‌ వంటి కృత్రిమ అవయవాలు ఉచితంగా తయారు చేసిచ్చి వారందరికీ జగదీష్‌బాబు వూతకర్రగా మారిపోయారు. తన వద్దకు వచ్చినవారు ఎక్కడున్నా ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు తెలుసుకుని వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి సైతం ఆర్థికంగా సహకరిస్తారాయన.

Related posts

Leave a Comment