ఆలస్యం.. అమృతం.. వేగం అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ మెట్రోరైల్‌ ట్రయల్స్‌ తీరిది

అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌వరకు మెట్రో మార్గం పూర్తయ్యింది.. ఇంకేం ఆగస్టులోనే ప్రారంభమని అధికారులు గతంలో ప్రకటించారు.. మళ్లీ ఇప్పుడు సెప్టెంబరు మొదటి వారానికి ముహూర్తం మార్చారు.. ఎందుకిలా జరిగింది..?? అసలు ఎందుకు జాప్యం జరిగింది..? వెంటనే ప్రారంభించేందుకు అవరోధాలు ఎందుకు వచ్చాయి..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వీటిన్నింటికీ సమాధానం.. కమ్యూనికేషన్‌ ఆధారిత ట్రైన్‌ నియంత్రణ(సీబీటీసీ) పరీక్ష. ప్రస్తుతం దీని కారణంగా ఎల్బీనగర్‌కు మెట్రో పరుగు ఆలస్యమవుతోంది.

తొలి విడతలో అమీర్‌పేట-నాగోల్‌ హడావుడిగా ప్రారంభించడంతో చాన్నాళ్లపాటు మెట్రోరైలు నిర్ణీత వేగం కంటే నెమ్మదిగా తిప్పాల్సి వచ్చింది. దీనివల్ల ఒక దశలో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. మలి విడత అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ మార్గంలో ఇలాంటి సాంకేతిక అవరోధాలు లేకుండా ప్రారంభం నుంచే వేగంగా మెట్రో పరుగులు పెట్టించేందుకు ప్రయోగాత్మక పరుగులో సీబీటీసీ సాంకేతికతను పరీక్షిస్తున్నారు. అందుకే ప్రారంభం ఆలస్యం అవుతోందంటున్నారు మెట్రో అధికారులు.

మూడు దశల్లో..
ప్రస్తుతం మెట్రోరైల్‌ నడుస్తున్న మార్గాన్ని మూడు దశల్లో సిద్ధం చేశారు. మొదట నాగోల్‌ నుంచి మెట్టుగూడ వరకు, తర్వాత మియాపూర్‌-ఎస్‌ఆర్‌నగర్‌ వరకు పూర్తి చేశారు. ఈ రెండూ కలిపి 20 కి.మీ. మార్గంలో సీబీటీసీతో నడిపేందుకు అనుమతులు వచ్చాయి. కాకపోతే ఈ రెండు మార్గాలు వేర్వేరు కారిడార్లలో ఉన్నాయి. పైగా స్వల్పదూరం అయినందున పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రారంభించలేదు. మెట్టుగూడ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ వరకు పూర్తిచేస్తే నగరంలో ఒక మూల నుంచి మరో మూల వరకు మెట్రో అందుబాటులోకి వస్తుందని హడావుడిగా పూర్తిచేశారు. మెట్టుగూడ-ఎస్‌ఆర్‌నగర్‌ వరకు సీబీటీసీ పరీక్షించకుండానే డ్రైవర్‌తో నడిపేందుకు భద్రతా అనుమతులు ఇచ్చారు. వేగ పరిమితులు విధించారు. సీబీటీసీ అనుమతులు వచ్చేవరకు మొదట నాలుగు నెలల పాటు ప్రయాణికుల సహనానికి పరీక్షగా మెట్రోరైళ్లు నెమ్మదిగా నడిచాయి.
ఇప్పుడు ఒకే కారిడార్‌.. మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ ఒకే కారిడార్‌. రైళ్లు మారాల్సిన పనిలేదు. మియాపూర్‌-అమీర్‌పేట వరకు సీబీటీసీతో ఆటోమెటిక్‌గా మెట్రో నడుస్తోంది. ఇప్పుడు మిలిగిన అమీర్‌పేట-ఎల్‌బీనగర్‌ 16 కి.మీ. మార్గాన్ని సైతం సిద్ధం చేస్తే ఎలాంటి వేగ ఆటంకాలు లేకుండా నడపొచ్చు. అందుకు ఈ సాంకేతికతతో ప్రస్తుతం ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. యూకేకు చెందిన హల్‌క్రో సంస్థ ట్రయల్‌రన్‌ను మదింపు చేస్తోంది. పరీక్షలు సంతృప్తికరంగా వచ్చాక వీరు తమ నివేదికను ఎల్‌అండ్‌టీ మెట్రోకి అందజేస్తారు. వీరు కమిషనర్‌ ఆఫ్‌ మెట్రోరైలు సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్‌)కి సమర్పిస్తే వారు అధికారికంగా తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ‘సీఎంఆర్‌ఎస్‌ అనుమతి ఈ నెలాఖరు వరకు వస్తుంది. సీఎం సమయం తీసుకుని సెప్టెంబరు మొదటివారంలో ప్రారంభం ఉంటుంది’ అని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

సీబీటీసీ అంటే..?
కమ్యూనికేషన్‌ ఆధారిత ట్రైన్‌ నియంత్రణ(సీబీటీసీ)లో మెట్రోరైలు తనంతట తానే పరుగులు తీస్తూ తన గమనాన్ని, వేగాన్ని నియంత్రించుకుంటుంది. డ్రైవర్‌తో సంబంధం లేకుండా అవసరమైనప్పుడు బ్రేకులు వేసుకుంటుంది. నాగోల్‌ డిపోలో ఉన్న ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నియంత్రించేందుకు వీలుంటుంది. ఇందులో అధునాతన సిగ్నలింగ్‌ వ్యవస్థ కీలకం. ఫ్రాన్స్‌కు చెందిన థాలెస్‌ కంపెనీ ఇందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను, సామగ్రిని సమకూర్చింది. రేడియో సమాచార ఆధారిత వ్యవస్థ రైళ్ల గమనాన్ని నిరంతరం ప్రసారం చేస్తుంటుంది. రైళ్లు ఒకదానితో ఒకటి సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ తమ మధ్య దూరాన్ని నియంత్రించుకుంటాయి. ఫలితంగా ప్రతి ఒకటిన్నర నిమిషం వ్యవధిలో ఒక మెట్రో నడిపేందుకు వీలుండటం ఇందులో ప్రత్యేకత.

Related posts

Leave a Comment