ఆలయంలో ఏం జరిగినా నాదే బాధ్యత

దుర్గగుడి ఈవో సూర్యకుమారి

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో ఓ అజ్ఞాత వ్యక్తి తాంత్రిక పూజలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆలయ ఈవో సూర్యకుమారి బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘డిసెంబరు 26న అర్ధరాత్రి ఆలయంలో శుద్ధి జరిగింది, పూజ జరగలేదు. ఆలయంలోకి వచ్చిన వారిలో పార్థసారధి తప్ప మిగిలినవారంతా పాతవారే. నాపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. పూజల కోసం పిలిచారని ప్రధాన అర్చకులు ఎక్కడా చెప్పలేదు. రోజు చేసే అలంకారం మాత్రమే చేశారు. ఆరోజు ఏం జరిగిందనేదానిపై ఎన్సీఎఫ్‌, మా సిబ్బంది, శానినేటషన్‌ సిబ్బందిని విచారిస్తున్నాం. అలంకారానికి సంబంధించిన సామగ్రి మాత్రమే లోపలికి తీసుకెళ్లారు.

ఆలయంలో ఏం జరిగినా నైతికంగా నాదే బాధ్యత. ఎలాంటి విషయమైనా ఆధారాలు లేకుండా మాట్లాడను. దుర్గగుడిలో వంద రకాల గ్రూపులున్నాయి. ఆలయంలో జరిగే పనులపై గుత్తేదార్ల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. నా హయాంలో భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం పెరిగింది. కేవలం కార్తీకమాసంలోనే గతం కంటే రూ.కోటి ఆదాయం పెరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నాకు సమాచారం లేదు. వాస్తవ విషయాలను మంత్రికి తెలియజేశా. నన్ను లక్ష్యంగా చేసుకుని కొందరు ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియదు. పాలకమండలి సభ్యులతో అంతరం ఉన్నమాట వాస్తవం. అమ్మవారి ప్రతిష్ఠ ముఖ్యం, ఎవరైనా దిగజారి ఏ పని చేసినా పాపభీతిలేని చర్యే అవుతుంది’’ అని ఈవో వెల్లడించారు.

Related posts

Leave a Comment