ఆదాయ వృద్ధిలో అత్యధికంగా 17.2% వృద్ధిరేటు నమోదు

నాలుగేళ్ల సగటులో దేశంలోనే అగ్రస్థానం
14.2 శాతంతో ద్వితీయ స్థానంలో హరియాణా
తెలంగాణ రాష్ట్రం ఆదాయాభివృద్ధి రేటులో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) తెలిపింది. గత నాలుగేళ్లలో 17.2 శాతం సగటు వృద్ధితో రాష్ట్ర స్వీయ ఆదాయంలో మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని కాగ్‌ తాజా గణాంకాలను నమోదు చేసినట్లు సీఎంఓ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
* 2014 నుంచి 2018 వరకూ వివరాలను కాగ్‌ ప్రకటించగా నాలుగేళ్లకు గాను తెలంగాణ 17.2 శాతం సగటు నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
* 14.2 శాతంతో హరియాణా రెండో స్థానంలో, 13.9 శాతంతో మహారాష్ట్ర మూడో స్థానంలో, ఒడిశా (12.4 శాతం), పశ్చిమబంగా (10.3శాతం)లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
* మిగిలిన రాష్ట్రాలన్నీ 10 శాతంలోపు వృద్ధిరేటును నమోదు చేశాయని సీఎంఓ వివరించింది.
* తెలంగాణ రాష్ట్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం, 2016-17లో 21.1, 2017-18లో 16.8 శాతం వృద్ధిరేటు సాధించిందని తెలిపింది.
ఆర్థిక ప్రగతి శుభసూచకం
రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపులో ప్రజలు చూపిస్తున్న చిత్తశుద్ధితోనే ఆదాయాభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిన పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) వంటి నిర్ణయాల తర్వాత కూడా రాష్ట్రం సుస్థిరమైన ఆదాయాభివృద్ధితో పురోగమించటం శుభసూచకమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా అమలు చేసుకోవడానికి ఆదాయాభివృద్ధి ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Related posts

Leave a Comment