ఆంధ్రప్రదేశ్‌పై మోదీకి ఎలాంటి వివక్ష లేదు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌

ఏపీకి హోదా ఇస్తే.. మహారాష్ట్ర కూడా అడుగుతుంది
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై ప్రధానమంత్రి మోదీకి ఎలాంటి వివక్ష లేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా అడుగుతాయన్నారు. అందుకే ప్రత్యేక హోదా కాకుండా.. దానితో సమానంగా ప్రయోజనాలు ఏపీకి దక్కేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని తెలిపారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినా.. ఎవరికీ హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్టీయే కూటమి నుంచి బయటకు వెళ్లిపోయిందని కేంద్రమంత్రి విమర్శించారు.

అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హామీని విస్మరిస్తారా? అని మీడియా నిలదీయగా.. హోదా ఇవ్వకున్న హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కల్పిస్తామని జితేంద్ర సింగ్‌ సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సాయం అందించే విషయంలో కేంద్రం ఏనాడు వెనకడుగు వేయలేదన్నారు. రూ.350 కోట్లు ఏపీ ఖాతాలో వేసి వెనక్కి తీసుకోవడంపై మీడియా నిలదీసింది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కేంద్ర కారణం కాదని.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని కేంద్రమంత్రి ఆరోపించారు. వినియోగ పత్రాలపై తెదేపా నేతలు మాట్లాడినప్పుడు అమిత్‌ షా సమాధానం చెబితే తప్పేంటని ఆయన‌ ప్రశ్నించారు.

Related posts

Leave a Comment