ఆంధ్రప్రదేశ్‌కు దక్కని కేంద్రం ఆసరా

పునర్‌ వ్యవస్థీకరణ తరవాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నా, కేంద్రం నుంచి లభిస్తున్న చేయూత అంతంతే. ఎక్కడ ఏ ఆసరా దొరికినా అందిపుచ్చుకోవాలని రాష్ట్రం తపన పడుతోంది. ప్రపంచం అమరావతి వైపు చూడాలని అభిలషిస్తూ ప్రయత్నాలు సాగిస్తోంది. అసలే ఆర్థిక లోటు, సేవారంగం అభివృద్ధి చెందని రాష్ట్రం. ఆదాయం అరకొర. ఉద్యోగాల సృష్టి కత్తిమీద సాము. మౌలిక సౌకర్యాల కల్పనే కీలకం. ఉత్తరాంధ్ర, రాయలసీమకు తోడు ప్రకాశం జిల్లాలోనూ అభివృద్ధి నామమాత్రం. కీలక ప్రాజెక్టులు సాకారం కావాలంటే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం. అంత భూరిస్థాయిలో పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి. అప్పులతోనే అభివృద్ధి బాటలు వేసుకోవాల్సిన దుస్థితి. అందుకే ప్రపంచ దేశాల ఆసరా కోసం ఆంధ్రప్రదేశ్‌ ఎదురుచూస్తోంది. విదేశీ ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుంటాయి. ఆ రుణాలతో కీలక ప్రాజెక్టులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. విదేశీ ఆర్థిక సాయంతో (ఈఏపీ) చేపట్టే పనుల్లో కేంద్ర ప్రభుత్వానిదే కీలకపాత్ర. ప్రాజెక్టు నివేదిక తీసుకుని పరిశీలించి ఆమోదించడం నుంచి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వరకు హస్తిన తోడ్పాటే ప్రధానం. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, రుణ సామర్థ్యాన్ని మదింపు చేసి, ఈ ప్రాజెక్టులకు కేంద్ర పచ్చజెండా ఊపుతూ ఉంటుంది.

పునర్‌ విభజనతో ఊపిరి తీసుకోవడం కష్టమైన ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టుల పరంగా కేంద్రం ఇచ్చిన మాట చిన్నదేమీ కాదు. చట్టసభల్లో నాడు వారు హామీ ఇచ్చినట్లుగా ప్రత్యేక హోదా అమలు చేసి ఉంటే- విదేశీ ఆర్థిక సాయం రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమయ్యేది. ఆ రుణం భారమయ్యేదీ కాదు. సింహభాగం రుణదాతలకు కేంద్రమే చెల్లించాల్సి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం కొంతలో కొంత అందిస్తే సరిపోయేది. ఇప్పుడు కేంద్రం ఆడిన మాట తప్పింది. ఆ బాధ్యత నుంచి పూర్తిగా వైదొలగింది. హోదా లేదంది. చేత తక్కువ… మాట ఎక్కువగా మారిపోయింది. ప్రత్యేక ఆర్థిక సాయం అంటూ కొత్తపల్లవి అందుకుంది. ఈ మాట చెప్పీ రెండేళ్లు కావస్తోంది. ఇప్పుడు వెనుతిరిగి చూసుకుంటే ఈ విషయంలో కేంద్రం నుంచి దక్కిందేమీ లేదు. ఫార్ములాలు, అంకెలు, గణాంకాలు మాత్రమే కాగితాలపై మిగిలాయి. విదేశీ సాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు వడ్డీ మొత్తమూ రాష్ట్రమే చెల్లించుకోవాల్సి వస్తోంది.

Related posts

Leave a Comment