అవసరాలు తీర్చితే అభ్యంతరం లేదు

గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన 954 టీఎంసీల నికరజలాలుపోను మిగిలిన జలాలను నదుల అనుసంధానంలో భాగంగా తరలించేందుకు తమకెలాంటి అభ్యంతరంలేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు కేంద్రానికి మరోసారి స్పష్టంచేశారు. ఢిల్లీలో సోమవారం కేంద్ర జలవనరులశాఖమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) 32వ వార్షికోత్సవానికి అన్ని రాష్ర్టాల నీటిపారుదలశాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రి హరీశ్.. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అవసరాలు తీరాక మిగిలిన జలాలనే అనుసంధానం ద్వారా తరలించాలని కరాఖండిగా చెప్పామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్‌లు ఇవ్వకుండా నదుల అనుసంధానానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఎలా
తయారుచేస్తారని ప్రశ్నించామని, డీపీఆర్ తయారుచేయడాన్ని వ్యతిరేకించామని చెప్పారు.
తెలంగాణ, ఏపీకి కేటాయింపుల తర్వాత నదుల అనుసంధానంపై ఆలోచించాలని స్పష్టంచేశామని, ఇదే అంశాన్ని కేంద్రమంత్రికి రాతపూర్వకంగానూ తెలిపామన్నారు. జాతీయహోదా ఏ ప్రాజెక్టులకూ ఇవ్వడంలేదని పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పారని, కానీ 60:40 నిష్పత్తిలో గ్రాంట్లు ఇస్తామని తెలిపారని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. మహారాష్ట్రలోని కొన్నిప్రాజెక్టులకు గ్రాంట్లు ఇచ్చినట్టుగానే తెలంగాణకు కూడా గ్రాంట్లు ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను వెంటనే ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్లు ప్రాజెక్టుల నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల పరిస్థితులపై సమీక్షిస్తున్నారని, ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించి, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికారులను ఆదేశిస్తున్నారని తెలిపారు.
TAGS:Minister Harish Rao , NWDA Meeting , Nitin Gadkari , National Water Development Agency , Telangana , Rivers , Irrigation Projects

Related posts

Leave a Comment