అల్లు అర్జున్‌తో సినిమా చేస్తా!

‘సోలో’, ‘సారొచ్చారు’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పరశురామ్‌. ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు. అల్లుఅరవింద్‌ సమర్పణలో బన్ని వాసు నిర్మించారు. చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో పరశురామ్‌ విలేకర్లతో చెప్పిన విశేషాలివీ..!

‘‘ఈ ‘గీతగోవిందం’ ప్రేమకథ రాధాకృష్ణుల ప్రేమను ప్రేరణగా తీసుకుని అల్లాను. కేవలం యువతకే కాదు. ప్రతిఒక్కరికీ నచ్చుతుంది. నా సినిమాల్లో ఉండే వినోదం, భావోద్వేగాలు ఇందులోనూ ఉంటాయి. విజయ్‌, రష్మిక పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. గోవిందం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. రష్మిక ఐటీ ఉద్యోగిని. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది. ఆ తర్వాత వాళ్ల ప్రేమ ప్రయాణం అపోహలు, అపార్థాలతో ఎలా సాగిందనేదే సినిమా. ఏడేళ్ల నుంచి డెభ్బై ఏళ్ల మధ్య వయసున్న అందరికీ తమ గత ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తు చేసేలా ఈ కథ సాగుతుంది. ఇందులోని ప్రతి పాట మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఒకపాటని విజయ్‌ దేవరకొండ పాడటం విశేషం. తనతో పాడించాలని నేనే అనుకున్నాను. ఆ పాట ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. గోవిందం నిరాశతో ఉన్నప్పుడు పాడే పాట ఇది. ఈ పాటలోని కొన్ని పదాలపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా విడుదలైతే గనక ఆ పదాలు వాడటం తప్పు కాదని తెలుస్తుంది. అభ్యంతరాలు రావడంతో వివాదాలు ఎందుకనే ఉద్దేశంతో దాన్ని తొలగించేసి ‘వాట్‌ ద లైఫ్‌’ అనే పదాన్ని చేర్చాం పాటలో. ఈ సినిమా నా కెరీర్‌లోనే పెద్ద మలుపు. గొప్ప విజయం.’’

‌్ర ‘‘అల్లు అర్జున్‌తో ఉన్న స్నేహం వల్ల తనకి తరచూ కథలు వినిపించేవాణ్ని. అవి విని అల్లు అర్జున్‌ మెచ్చుకొనేవారు. ఇది తెలిసిన కొందరు ‘మీరు బన్నీతో సినిమా చేయొచ్చు కదా!’ అని అడిగారు. బన్నీకి ఎప్పుడు? ఏ కథ సరిపోతుందో? అప్పుడు… అలాంటి కథనే తెరకెక్కిస్తా. బన్నీతో త్వరలోనే సినిమా చేస్తా. అగ్రకథా నాయకులతో సినిమాలు చేయాలనుంది. అయితే ఆ అగ్ర కథానాయకుల ఆలోచనల్ని నేను చేరుకోవాలి. ఆ సమయం రావాలి.’’
‌్ర ‘‘గీత గోవిందం’ గీతా ఆర్ట్స్‌లో నా రెండో చిత్రం. మూడో సినిమా కూడా త్వరలోనే చేయనున్నాను. దానికి సంబంధించిన కథ గురించి అల్లు అరవింద్‌గారితో చర్చించాను. ఆ కథ బన్నీతో కాదు. వేరే కథానాయకుడితో చేస్తా. బన్నీతో చేసే కథ వేరే ఉంది. ఇంకా మైత్రీ మూవీస్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది. నేను ఈ పదేళ్లలో తక్కువ సినిమాలే చేసుండొచ్చు. అలా అని నా కెరీర్‌ నెమ్మదిగా లేదు. నా జీవితం సంతోషంగానే వెళుతుంది. వేగంగా సినిమాలు చేసి సంఖ్య పెంచుకోవాలనేది నా విధానం కాదు. నా సినిమాలు ప్రేక్షకులకి నచ్చాలి, నిర్మాతలకు డబ్బులు రావాలనే అనుకుంటాను’’

Related posts

Leave a Comment