‘అమ్మో’రికా చదువు!

అక్కడి విద్యకు ఏటా మనవాళ్లు పెడుతున్న ఖర్చు రూ. 42,000 కోట్లు
విదేశాల్లోని మన విద్యార్థులు 5.53 లక్షల మంది
స్థిరపడేందుకే ఈ వలసలు అంటున్న విద్యావేత్తలు
మనదేశంలో తగినంత భరోసా లేకపోవడమే కారణం
ఉన్నతవిద్యపై కేంద్ర విద్యాశాఖ వెచ్చిస్తున్నది రూ. 30,000 కోట్లే
భారతీయ యువతకు అమెరికా, కెనడా, జర్మనీ, చైనా తదితర దేశాల్లో చదువంటే ఎంతో ఆసక్తి.. నాణ్యమైన విద్య.. మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది వారి ఆశ. కొందరైతే ఇందుకోసం ఎంత ఖర్చుకైనా సిద్ధపడుతున్నారు. ఒక్క అమెరికాలోనే విద్య కోసం మన విద్యార్థులు పెడుతున్న ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యపై వెచ్చిస్తున్న బడ్జెట్‌ను మించిపోతోందని ఇటీవల విడుదలైన నివేదిక ఒకటి సృష్టం చేసింది. అమెరికా విద్యాశాఖతో కలిసి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ సర్వేచేసి ఈ నివేదికను రూపొందించింది. ఈలెక్కన ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మన విద్యార్థులు చదువు కోసం పెడుతున్న ఖర్చు మొత్తం లెక్కిస్తే ఎన్నో రెట్లు ఉంటుందనేది నిపుణుల అంచనా.
అమెరికాలోనే 2 లక్షల మంది
మొత్తం 86 దేశాల్లో 5,53,440 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని వారే దాదాపు 3.70 లక్షలమంది ఉండటం గమనార్హం. అమెరికాలో ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య 11 లక్షలు ఉండగా, వారిలో 2.6 లక్షలమందితో చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఒక్కో భారతీయ విద్యార్థి ఏటా సగటున ట్యూషన్‌ రుసుం, ఇతర ఖర్చులకు రూ. 15 లక్షల వరకు వెచ్చిస్తారని అంచనా వేసుకున్నా ఏడాదికి మొత్తం రూ. 30,900 కోట్లు అవుతుంది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ సర్వే ప్రకారం 2016-17 సంవత్సరంలో భారతీయ విద్యార్థులు 6.54 బిలియన్‌ అమెరికా డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఇది దాదాపు రూ. 42,000 కోట్లు. 2013-14 విద్యాసంవత్సరంలో 3.3 బిలియన్‌ అమెరికా డాలర్లు వెచ్చించారని, 2016-17 నాటికి అది 6.54 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని సర్వే వెల్లడించింది. విశేషమేమిటంటే.. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు వెచ్చించిన మొత్తం రూ. 29,700 కోట్లు. అంటే అమెరికాలో మన విద్యార్థులు పెడుతున్న ఖర్చు దీనికంటే రూ. 12,000 కోట్లు అధికం. ఇక మిగతా అన్ని దేశాల్లో ఖర్చును వెచ్చిస్తే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.

కేవలం చదువు కోసమే కాదు..
ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోల్చినప్పుడు తొలి 500 విద్యాసంస్థల్లో నిలిచే వాటిలో అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లోని విద్యాసంస్థలే ఎక్కువగా ఉంటాయి. భారతీయ విద్యాసంస్థలు నాలుగైదు కంటే ఉండవు. అయితే మనవాళ్లు విదేశీ విద్యపై ఆసక్తి చూపడానికి ఇదే ప్రధాన కారణమని కూడా చెప్పలేమని విద్యావేత్తలు అంటున్నారు. ఎందుకంటే విదేశాలకు వెళ్లినవారంతా తొలి 500 జాబితాలోని విశ్వవిద్యాలయాల్లోనే చేరడం లేదని.. అన్నింటిలోనూ చేరుతున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయం అకడమిక్‌ ఆడిట్‌ విభాగం సంచాలకుడు, ఆర్థికశాస్త్రం ఆచార్యుడు వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. అమెరికా లాంటి దేశాల్లో చదువు కోసం ఎంత ఖర్చు చేసినా తర్వాత ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడవచ్చని వారు ఆశిస్తున్నారని తెలిపారు. ‘విదేశాల్లో చదువుకుంటూ సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…దానివల్ల మొదటి సెమిస్టర్‌కు ఖర్చు భరిస్తే తర్వాత ఏదో ఒక తాత్కాలిక ఉద్యోగం చేసి ట్యూషన్‌ రుసుములు చెల్లించవచ్చని భావిస్తున్నారు’ అని ఓయూ వాణిజ్యశాస్త్రం సీనియర్‌ ఆచార్యుడు ఎస్‌వీ సత్యనారాయణ చెప్పారు. కేంద్రం ఇక్కడా చదువుకుంటూ సంపాదించుకోవడం లాంటి సంస్కరణలను ప్రవేశపెట్టాలని, యువతకు ఉజ్వల అవకాశాలు ఇక్కడే ఉన్నాయన్న భరోసా లభిస్తే తప్ప విద్యార్థుల వలసలు ఆగవన్నారు.

Related posts

Leave a Comment