అమ్మాయి నచ్చితే ప్రపోజ్ చేయండి.. తిరస్కరిస్తే కిడ్నాప్ చేయండి: బీజేపీ ఎమ్మెల్యే

కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన ‘దహీ హండీ’ వేడుకల్లో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కడామ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘దహీ హండీ’ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అబ్బాయిలకు తాను అండగా ఉంటానని, నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయాలని సూచించారు. అమ్మాయిలు కనుక ప్రపోజల్‌ను తిరస్కరిస్తే కిడ్నాప్ చేయాలని, లేదంటే తనకు చెబితే కిడ్నాప్ చేసి అప్పగిస్తానని ఆఫర్ ఇచ్చారు. తన ప్రేమను అమ్మాయి అంగీకరించడం లేదని ఒక్క మాట చెబితే ఆమెను ఎత్తుకొచ్చి పెళ్లి జరిపిస్తానని, తన ఫోన్ నంబరు రాసుకోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బాలీవుడ్ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు వేదికపై ఉండగానే ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సర్వత్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. రామ్ కడామ్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను ఎన్‌సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని జితేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులే ఇలా మాట్లాడితే స్త్రీలు స్వేచ్ఛగా ఎలా తిరగ గలుగుతారని ప్రశ్నించారు. మరోవైపు నెటిజన్లు కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్నారు.

Related posts

Leave a Comment