అమెరికా చట్ట సభ్యుల్ని నేరస్తులుగా చూపుతున్న అమేజాన్ టూల్

నేరస్తులు, ప్రజల మధ్య తేడాను గుర్తించడంలో విఫలం
అమెరికాలో నానాటికి పెరుగుతున్న వ్యతిరేకత
పోలీసులు వలసదారుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శలు
టెక్నాలజీని సరిగ్గా వాడకుంటే ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయో అనేందుకు ఇదే తాజా ఉదాహరణ. అమెరికా దిగ్గజ కంపెనీ అమేజాన్ 2016లో ఫేస్ రికగ్నిషన్ టూల్ పేరిట ఓ సాంకేతికతను అభివృద్ధి చేసింది. వేలాది మంది మధ్యలో కూడా నేరస్తుల్ని గుర్తించేలా తయారుచేసి మార్కెట్ లో అందుబాటులోకి సైతం తీసుకొచ్చింది. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్(ఏసీఎల్ యూ) అనే సంస్థ గురువారం నిర్వహించిన పరీక్షలో 28 మంది అమెరికన్ చట్ట సభ్యుల్నిఈ టూల్ నేరస్తులుగా చూపడం కలకలం రేపింది. ఈ 28 మంది చట్ట సభ్యుల్లోనూ 40 శాతం మంది నల్లజాతివారేనని ఏసీఎల్ యూ తెలిపింది. ఈ సాంకేతికతపై సామాన్య ప్రజల్లో నానాటికి వ్యతిరేకత పెరుగుతోందని వెల్లడించింది.

ప్రస్తుతం అమెరికాలోని ఓరెగావ్, ఫ్లోరిడా తదితర ప్రాంతాల్లో అమేజాన్ ఫేస్ రికగ్నీషన్ టెక్నాలజీని వాడుతున్న పోలీసులు.. శ్వేత జాతీయులు కానివారిని, వలసదారుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఈ సంస్థ ఆరోపించింది. లోపభూయిష్టమైన ఈ సాంకేతికత వాడకాన్ని నిలిపివేయాలని ఆందోళనలు నిర్వహించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించింది. ఏసీఎల్ యూ నిర్వహించిన పరీక్షలో ముగ్గురు డెమొక్రటిక్ పార్టీ సెనెటర్లను ఈ టూల్ నేరస్తులుగా చూపడంతో వారంతా అమేజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కు లేఖ రాశారు. ఈ సాంకేతికతను పోలీసులు వినియోగించడంపై తాము ఆందోళన చెందుతున్నట్లు వారు లేఖలో పేర్కొన్నారు.

Related posts

Leave a Comment