అమాయకత్వంతో ‘ఓటీపీ’ చెప్పి.. రూ.7 లక్షలు పోగొట్టుకున్న మహిళ!

అమాయకత్వంతో ‘ఓటీపీ’ చెప్పి.. రూ.7 లక్షలు పోగొట్టుకున్న మహిళ!

ఆన్‌లైన్ మోసగాడికి ఓటీపీ చెప్పిన మహిళ
అలా చెప్పకూడదన్న విషయం తనకు తెలియదన్న గృహిణి
లక్షల రూపాయలు కొల్లగొట్టిన నిందితుడు
అమాయకత్వంతో ఆన్‌లైన్ మోసగాడికి 28 సార్లు ఓటీపీ చెప్పిన ఓ మహిళ ఏకంగా ఏడు లక్షల రూపాయలు కోల్పోయింది. ముంబైలో జరిగిందీ ఘటన. అన్నిసార్లు ఓటీపీ ఎలా చెప్పావన్న పోలీసుల ప్రశ్నకు అలా చెప్పకూడదన్న విషయం తనకు తెలియదని బిక్కమొహం వేసింది.

నవీముంబైలోని ధారావి గ్రామానికి చెందిన గృహిణి (40)కి ఫోన్ చేసిన ఓ ఆన్‌లైన్ మోసగాడు తనను తాను ఎస్‌బీఐ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. మీ ఏటీఎం కార్డు పనిచేయడం లేదని, అది తిరిగి పనిచేయాలంటే ఏటీఎం కార్డు వివరాలు, మొబైల్‌కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అతడు చెప్పినట్టే చేసిన ఆమె అమాయకత్వంతో అతడు ఫోన్ చేసిన ప్రతిసారీ ఓటీపీ చెప్పేసింది. ఇలా మొత్తం 28 సార్లు ఫోన్ చేసి ఓటీపీ చెప్పించుకున్న మోసగాడు ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.6.98 లక్షలు కాజేశాడు.

పాస్‌బుక్‌లో వివరాలు నమోదు చేసేందుకు ఇటీవల బ్యాంకుకు వెళ్లిన ఆమె ఖాతా నుంచి రూ.6.98 లక్షలు మాయమైన విషయం తెలిసి లబోదిబోమంది. ఆ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆన్‌లైన్ మోసాలపై ఆమెకు అవగాహన లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు. తన భర్త కువైట్‌లో ఉంటాడని చెప్పిన ఆమె, కుమారుడి చదువు కోసం ఇటీవలే రూ.10 లక్షల ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నట్టు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ‘ఆక్సిజన్’ వ్యాలెట్‌కు రూ.4 వేలు, ముంబైలోని ఓ ‘ఫోన్ పే’ వ్యాలెట్‌కు రూ.49,999 పంపినట్టు గుర్తించారు.

Related posts

Leave a Comment