అమలులో విఫలమైతే ఉద్యోగం ఊడినట్టే

కొత్త కార్యదర్శుల వ్యవస్థపై సీఎం స్పష్టీకరణ
‘‘కొత్తగా వచ్చే కార్యదర్శులకు ప్రస్తుత గ్రామం ఎలా ఉంది? మూడేళ్ల తర్వాత ఎలా ఉండాలి? అనేది తొలుతే స్పష్టంచేయాలి. గ్రామాల్లో చెట్లు పెంచటం, నర్సరీల ఏర్పాటు, శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణం, పన్ను వసూళ్లు తదితరాలకు సంబంధించి చార్టును రూపొందించాలి. చిన్న పంచాయతీల వల్ల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ మరింత తేలికవుతుంది. కోర్టు కేసుల వల్ల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. ఆలోగా అభివృద్ధి పనులు కుంటుపడకుండా చూసేందుకే ప్రత్యేక అధికారులను నియమిస్తున్నాం’’ – ముఖ్యమంత్రి కేసీఆర్‌

రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరే 9,200 మంది పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్లలో చేయాల్సిన పనులపై తొలుతే ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి అందజేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ఆ ప్రణాళికకు అనుగుణంగా వారు పనిచేస్తున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ..మూడేళ్లు కాగానే బాగా పనిచేసినవారిని క్రమబద్ధీకరించి, అలా పనిచేయలేదని తేలినవారిని తొలగించాలని ఆయన స్పష్టంచేశారు. పంచాయతీల్లోని అవసరాల కోసం ఒక్కో జిల్లాకు రూ.ఒక కోటి చొప్పున రూ.30 కోట్లను ఇస్తామని, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి విచక్షణాధికారాలతో ఈ సొమ్ము నుంచి కేటాయింపులు చేస్తారని సీఎం తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రగతి భవన్‌లో మంగళవారం సీఎం పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో భేటీ అయ్యి కొత్త కార్యదర్శుల ఎంపిక, పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి పంచాయతీకి కార్యదర్శి, ప్రత్యేక అధికారి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

Related posts

Leave a Comment