అపర భగీరథుల మాగాణం నేడు తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం

అరవై ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి మరుగున పడిపోయిన సంగతులను ఉద్యమ కాలంలో విస్తృతంగా చర్చించుకున్నాము. ఉమ్మడి రాష్ట్రంలో విస్మృతికి గురి అయిన అనేక మంది తెలంగాణ వైతాళికుల గురించి మాట్లాడుకున్నాము. అట్లా విస్మృతికి గురి అయిన వైతాళికుల్లో హైదరాబాద్‌ రాజ్యంలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, చారిత్రక కట్టడాలను నిర్మించిన విఖ్యాత ఇంజినీర్‌ నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌ ఒకరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆయన గురించి ఎవరికీ తెలియక పోయినా ఇప్పుడు తెలంగాణ యువతకు నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌ గురించి బాగా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ ఇంజినీర్ల కోరిక మేరకు ప్రభుత్వం అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌ జన్మ దినం జులై 11ని ‘తెలంగాణ ఇంజనీర్స్‌ డే’గా ప్రకటిస్తూ 2014 జులై 18న ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో తెలంగాణ సమాజం పులకించి పోయింది. గడచిన నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా జులై 11న అధికారికంగా తెలంగాణ ఇంజనీర్స్‌ డే జరుపుకొంటున్నారు. అంతటా ఆయన స్మారక చిహ్నాలు వెలుస్తున్నాయి. సాగునీటి శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే ఆయన విగ్రహాన్ని సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో 11 జూలై 2014న ఆవిష్కరించే భాగ్యం నాకు దక్కింది. వివిధ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్‌ ఇంజినీర్లకు- ‘నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌ మెమోరియల్‌ లైఫ్‌ టైం అవార్డు’ను 2015నుంచి ప్రదానం చేస్తున్నాం. గత 15ఏండ్లుగా మన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకునే క్రమంలో భాగంగా తెలంగాణ చరిత్ర పరిశోధకులు పలుగూ పారా పట్టుకొని చరిత్ర పురా తవ్వకాలు జరిపినారు. ఆ తవ్వకాల్లో బయటపడిన కోహినూర్‌ వజ్రమే నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌. హైదరాబాద్‌ రాజ్యంలో పుట్టి భారత్‌లోనే అత్యంత ప్రతిభావంతుడైన ఇంజినీర్‌గా ప్రఖ్యాతిగాంచిన మహనీయుడు ఆయన.

ఉత్తేజభరితంగా కార్యాచరణ
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణ ధార. మేడి గడ్డ వద్ద రోజుకు రెండు టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసి 18.25 లక్షల కొత్త ఆయకట్టుకు, 18.82 లక్షల ఆయకట్టు స్థిరీకరణకు నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. నీటిని 100 మీటర్ల ఎత్తు నుంచి 620 మీటర్ల ఎత్తుకు ‘లిఫ్ట్‌’ చేయడం జరుగుతుంది. 20 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన డిజైన్లతో, ఆధునిక సాంకేతిక వినియోగంతో, భారీ యంత్రాలతో ప్రాజెక్టులో సివిల్‌, మెకానికల్‌, ఎలెక్ట్రికల్‌ పనులు ఏక కాలంలో జరుగుతున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక శాఖల మధ్య సమన్వయంతో, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఆరు దేశాలనుంచి పంపులు, మోటార్లు ఇతర విద్యుత్‌ పరికరాలు సరఫరా అవుతున్నాయి. సుమారు ఆరు వేల మంది ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, 22వేల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో శ్రమిస్తున్నారు. మార్చి 2017లో మొదలైన ప్రాజెక్టు పనులు డిసెంబరు 2018 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందడుగులు పడుతున్నాయి. ఒకే ప్రాజెక్టులో బ్యారేజీలు, గ్రావిటీ కాలువలు, ప్రెషర్‌ పైపులు, సొరంగాలు, భూగర్భ పంప్‌ హౌజ్‌లు, సర్జ్‌ పూల్‌, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఉండటం ఒక విశేషం. కాగా, వాటిని ఏక కాలంలో చేపట్టడం మరో విశేషం. ప్రాజెక్టు పూర్తి అయితే 20 జిల్లాల్లో మొత్తం 38 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటితోపాటు- పరిశ్రమలకూ నీరు అందించడం సాధ్యపడుతుంది. ప్రాజెక్టులో ఒక రోజు 21 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వినియోగం జరిగింది. ప్రపంచంలో రెండో అతి ఎక్కువ వినియోగం ఇది. చైనాలోని త్రీ గార్జెస్‌ డ్యాంలో ఒక రోజులో 22వేల క్యూబిక్‌ మీటర్ల వినియోగం జరిగినట్టు రికార్డులు తెలుపుతున్నాయి. ప్రాజెక్టులో రోజుకు 1.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని సైతం జరుగుతోంది.

కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖ, వన్య ప్రాణి బోర్డు, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఐఆర్‌ఎం, ఐఐటీ, జీఎస్‌ఐ, ఎన్‌హెచ్‌ఏఐ వంటి సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అనుమతులు పొందుతూ ప్రభుత్వం ప్రాజెక్టును ముందుకు నడిపిస్తోంది. కాళేశ్వరాన్ని నిజానికి 20 ప్రాజెక్టుల సమాహారంగా భావించాలి. ఒక ఏడాదిలోగా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ సాధించడమూ ఒక రికార్డు! రాత్రనక, పగలనక సెలవులు లేకుండా నిరంతరం పని చేస్తూ 18 నెలల్లోనే ఇంజినీర్లు 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయగలగడం సామాన్యమైన విషయం కాదు.

ప్రాజెక్టుల నిర్మాణం అంటే గతంలో 10, 20 ఏండ్లపాటు సాగలాగేవారు. ఇప్పుడు మన ఇంజినీర్లు చరిత్రను తిరగరాస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులను సైతం రెండు, మూడేండ్లలోనే పూర్తి చేయగలం అని నిరూపిస్తున్నారు. కాంట్రాక్టు ఏజెన్సీలు కూడా అదనపు సమయం కోరకుండా (ఈఓటీ) గడువు లోపలే పనులు పూర్తి చేస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ శైలి ఇప్పుడు దేశానికి ఒక ఆదర్శ నమూనా. ప్రాజెక్టును ఇప్పటికే లక్షకు పైగా సందర్శకులు చూసి వెళ్ళినారు. కేంద్ర జల వనరుల సంఘం ఇంజినీర్లు బృందాలవారీగా కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయన యాత్ర చేసి వెళ్ళినారు. ప్రాజెక్టులో పనుల నిర్మాణ కౌశలాన్ని, ఆధునిక సాంకేతికతను, నిర్మాణం అవుతున్న వేగాన్ని చూసి అబ్బురపడిపోతున్నారు. గడచిన నాలుగేండ్లుగా అమలవుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్‌ కాకతీయ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నది. తెలంగాణకు చెరువులు అనాదిగా ఆధారాలు. వాటిని సమగ్రంగా పునరుద్ధరించి పూర్వ వైభవం కల్పించడం తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష. రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణలో ఉన్న 46వేల చెరువులను పునరుద్ధరించడానికి మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికి మూడు దశలు గడిచాయి. నాలుగో దశ కొనసాగుతోంది.

నాలుగు దశల్లో తెలంగాణావ్యాప్తంగా మొత్తం 18వేల చెరువుల పునరుద్ధరణ పూర్తి అయ్యింది. చెరువుల్లో పూడిక తీతవల్ల సుమారు 8.10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అదనంగా పెరిగింది. మిషన్‌ కాకతీయ అమలువల్ల రాష్ట్రంలో చిన్ననీటి పారుదల కింద 12.47 లక్షల ఎకరాలు- చెరువుల కింద అదనంగా స్థిరీకరణ పొందినాయి. మిషన్‌ కాకతీయ అమలు తరవాత 2016-17 లో 51.5శాతం సాగు విస్తీర్ణం చెరువుల కింద పెరిగిందని, 62శాతం చేపల పెంపకం విస్తరించిందని ‘నాబారు’్డ అనుబంద సంస్థ ‘నాబ్కాన్స్‌’ సర్వే ద్వారా తేల్చింది. తెలంగాణ గ్రామాల్లో సామాజిక, ఆర్థిక వికాసానికి ‘మిషన్‌ కాకతీయ’ దోహదం చేస్తున్నదని పేర్కొన్నది. మహబూబ్‌ నగర్‌, మెదక్‌లాంటి కరవు, వలస జిల్లాల్లో ఈ మార్పు స్పష్టంగా ప్రజల అనుభవాల్లోకి వస్తున్నది. చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానించడంతో రబీ కాలంలో కూడా చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. వ్యవసాయం పుంజుకొన్నది. వలసబోయిన జనం తిరిగి తమ గ్రామాలకు వచ్చి సొంత ఊరిలోనే ఉపాధి పొందుతున్నారు. ఇదంతా చిన్న నీటిపారుదల శాఖలో పని చేస్తున్న ఇంజినీర్ల కృషి ఫలితమే!

Related posts

Leave a Comment