అత్యాచారాలకు పాల్పడేవారికి ప్రభుత్వ పథకాలు బంద్‌

మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్షించడానికి ఎన్ని చట్టాలు చేసినా లాభం లేకుండా పోతోంది. అత్యాచార కేసులు పెరిగిపోతుండటంతో హరియాణ ప్రభుత్వం వీటిని నియంత్రించడానికి నడుం బిగించింది. అత్యాచారానికి పాల్పడే వారిపై, ఈ కేసుల్లో దోషులుగా తేలిన వారిపై ఉక్కుపాదం మోపనుంది. ఇకపై వారికి ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలను నిలిపివేయనుంది. మహిళా భద్రత కోసం హరియాణ ప్రభుత్వం గురువారం ఒక యాప్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఆవిష్కరించిన సందర్భంగా హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మీడియాతో మాట్లాడారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ రాష్ట్రంలో అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయి. వీటిని నియంత్రించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. మహిళలపై దాడులకు పాల్పడిన వారికి, అత్యాచారాలకు పాల్పడిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలను నిలిపివేస్తాం. రేషన్‌, పింఛను, ఇతర పథకాలు కూడా వారికి వర్తించకుండా చేస్తాం. అత్యాచార కేసుల్లో దోషులుగా తేలితే వారికి శాశ్వతంగా ప్రభుత్వ ప్రయోజనాలు దూరం చేస్తాం.’ అని తెలిపారు.

అత్యాచార కేసుల పరిష్కారం గురించి మాట్లాడుతూ…‘ అత్యాచార, మహిళలపై ఇతర దాడుల కేసులు నమోదైన రోజు నుంచి 15రోజుల్లోపు విచారణ అధికారి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలి. దీనికి సంబంధించి పక్షం రోజుల్లోపు నివేదికను సమర్పించాలి. లేకపోతే ఆ అధికారి మీద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ తరఫు న్యాయవాది కాకుండా ప్రైవేటు న్యాయవాదిని అత్యాచార బాధితులు నియమించుకోదలిస్తే వాళ్లకు ప్రభుత్వం తరఫు నుంచి రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తాం.’ అని అన్నారు.

Related posts

Leave a Comment