అతివేగానికి.. రూ.32లక్షల జరిమానా

లంబోర్గిణి హరికేన్‌లో చక్కర్లు కొట్టినందుకు ఫలితం
విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి రోడ్లపై డ్రైవింగ్‌ చేయాలంటే ట్రాఫిక్‌ నిబంధనలతో పాటు, నిబంధనల ఉల్లంఘనలకు ఎంతెంత జరిమానాలు వేస్తారో ముందే తెలుసుకోవడం మంచింది. ఎందుకంటే దుబాయిలో కారులో అతి వేగంగా వెళ్లినందుకు ఓ ప్రయాణికుడికి విధించిన జరిమానా ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వకుండా ఉండలేరు. ఆ జరిమానా అక్షరాలా రూ.32లక్షలు. లంబోర్గిణి కారును చాలా వేగంగా నడిపిన బ్రిటిష్‌ పర్యాటకుడికి దుబాయ్‌ పోలీసులు ఇంత మొత్తంలో జరిమానా విధించారు.

దుబాయ్‌ అంటే ఎత్తైన ఆకాశహర్మ్యాలు, భవనాలు, అందమైన రోడ్లే గుర్తొస్తాయి. అంతేగాకుండా ప్రంపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే, ఖరీదైన విదేశీ కార్లు ఇక్కడ ఉంటాయి. వీధి వీధిలో సూపర్‌కార్లు కనిపిస్తూనే ఉంటాయి. అత్యంత వేగంగా వెళ్లే బుగాటి, లంబోర్గిణి, తదితర విదేశీ కార్ల వల్ల దుబాయ్‌ పోలీసులకు ట్రాఫిక్‌ను అదుపులో ఉంచడం, వాటి వేగ నియంత్రణ కత్తిమీద సాములా ఉంటుంది. దీంతో వారు అత్యంత కఠినమైన ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తారు.

అయితే ఇటీవల ఓ 25ఏళ్ల బ్రిటిష్‌ పర్యాటకుడు దుబాయిలో లంబోర్గిణి హరికేన్‌ సూపర్‌కారును రెండు రోజులకు 1600డాలర్లు( సుమారు రూ.లక్ష) చెల్లించి అద్దెకు తీసుకున్నాడు. నగరంలోని అందమైన రోడ్లలో రయ్‌ రయ్‌ మంటూ చక్కర్లు కొట్టాడు. పాపం దుబాయి ట్రాఫిక్‌ నిబంధనల గురించి , రోడ్లపై ఉండే అత్యాధునికి స్పీడ్‌ కెమెరాల నిఘా గురించి అతడికి తెలిసినట్లు లేదు ఇంకేముందు పరిమిత వేగాన్ని దాటినప్పుడల్లా ఆ కారు ఖాతాకు జరిమానాలు జమవుతూ వచ్చాయి. కేవలం నాలుగు గంటల్లో ఏకంగా రూ.47వేల డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.32లక్షలు) జరిమానా పడింది. షేక్‌ జాయెద్ రోడ్డుపై వెళ్లాల్సిన వేగం కంటే రెట్టింపు వేగంతో వెళ్తూ 32సార్లు కెమెరాకు చిక్కాడు. మరో రోడ్డుపై ఓసారి అలాగే వెళ్తూ దొరికిపోయాడు. దీంతో అతడికి దుబాయి పోలీసులు 47వేల డాలర్ల జరిమానా విధించారు.

పోలీసులు వెంటనే కారు యజమానిని సంప్రదించి జరిమానాల గురించి సమాచారం ఇచ్చారు. అయితే కారు అద్దెకు ఇచ్చిన ఏజెన్సీ ముందుగానే గ్యారెంటీ కోసం సదరు పాస్‌పోర్ట్‌ను తమ వద్ద పెట్టుకుంది. బ్రిటిష్‌ పర్యటకుడిపై ప్రయాణ నిషేధం విధించాలని రెంటల్‌ ఏజెన్సీ పిటిషన్‌ వేయగా అది తిరస్కరణకు గురైంది. దీంతో ఏజెన్సీ బ్రిటన్‌ ఎంబసీని సంప్రదించింది. మీ దేశం పర్యటకుడి పాస్‌పోర్ట్‌ తమ ఆధీనంలో ఉందని, అతడు అతివేగంతో కారు నడపడం వల్ల పెద్ద మొత్తంలో జరిమానా పడిందని తెలియజేసింది. అయితే దీనిపై బ్రిటిష్‌ ఎంబసీ స్పందన తెలియరాలేదు.

Tags: dubai, traffic, rules ,lamborghini high speed,fine

Related posts

Leave a Comment