అంతా సైన్యం దయ…

ఇమ్రాన్‌ పాలనలో పాక్‌
ఒక ఆదర్శం కాని, అభివృద్ధి మంత్రం కాని లేని వ్యక్తిని సైతం గద్దె ఎక్కించగలనని పాకిస్థాన్‌ సైన్యం మరొక్కమారు నిరూపించుకొంది. ఈసారి ఇమ్రాన్‌ ఖాన్‌ సైన్యం దయకు పాత్రుడయ్యారు. పాక్‌లో ఎన్నికలు జరగడానికి చాలాముందు నుంచే ఇమ్రాన్‌ వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఈసారి అధికార పగ్గాలు ఆయన చేతికే చిక్కుతాయంటూ పలు విశ్లేషణలు వెలువడ్డాయి. సైన్యం కోరుకున్న లక్షణాలు ఇమ్రాన్‌లో మాత్రమే ఉండటం వల్లనో ఏమో ఆయన అధికారం చేజిక్కించుకోబోతున్నారు. నవాజ్‌ షరీఫ్‌కు గతంలో సైన్య కటాక్షవీక్షణాలు దక్కినా తరవాత ఆయన సేనానుల అనుగ్రహం కోల్పోయారు. జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కూడా సైన్యం అంచనాలకు తూగలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సక్రమంగా జరిగి ప్రజా మద్దతుతో అసలు సిసలు నాయకులు సింహాసనమెక్కడానికి వీలు కల్పించవచ్చు కదా! పాక్‌ సైన్యం అలా చేయకుండా ఎన్నికల ప్రక్రియలో తలదూర్చి దాన్ని నాశనం చేయడమెందుకు? పాకిస్థాన్‌లో అసలు సిసలు ప్రజాస్వామ్యం వేళ్లూనడం సైన్యానికి ఇష్టం లేదని పదేపదే స్పష్టమవుతూనే ఉంది. ఈసారీ అంతే. తాను ఆడమన్నట్లు ఆడే నాయకుడిని గద్దెపై ప్రతిష్ఠించి వెనక నుంచి తానే చక్రం తిప్పాలన్నది సైన్య వ్యూహం. అందుకు తగిన నాయకుడి కోసం అది చిరకాలంగా అన్వేషిస్తూ ఉంది. ప్రజల నుంచి వచ్చిన నాయకులంటే దానికి సరిపడదు.

ఉగ్రవాదులకు వత్తాసు
ఎన్నికలకు ముందు ఇమ్రాన్‌ పాక్‌ ఉగ్రవాద సంస్థలతో భుజాలు పూసుకొని తిరిగారు. 1999లో పాకిస్థాన్‌కు భారతీయ విమానాన్ని హైజాక్‌ చేసి తీసుకెళ్లిన హర్కత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా ఫజ్లుర్‌ రహమాన్‌ ఖలీల్‌ను తన పార్టీలో చేర్చుకున్నారు. లష్కరే తొయిబా తదితర ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలను కాదని ఏ రాజకీయ నాయకుడూ ముందుకెళ్లే ప్రసక్తి లేదు. కశ్మీర్‌లో పెద్ద భాగం ఇప్పటికీ పాక్‌ ఆక్రమణలోనే ఉంది. ఆ ప్రాంతాన్ని ఆజాద్‌ కశ్మీర్‌ అని పిలుచుకుంటున్నారు. ఆక్రమిత కశ్మీర్‌లో కొంత భాగాన్ని చైనాకు పాక్‌ పాలకులు ధారపోశారు. భారత్‌ ఈ భూభాగాలను తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. ఆ పని చేయడం ఇమ్రాన్‌వల్ల అవుతుందా? అసలు కశ్మీర్‌లో హింసాకాండకు పాల్పడకుండా పాక్‌ సైన్యాన్ని కాని, ఉగ్రవాదులను కాని ఆయన నిరోధించగలరా? నిజానికి ఇమ్రాన్‌ కూడా పాకిస్థాన్‌ అంతర్భాగంగా కశ్మీర్‌ ఉండాలని కోరుకునే వ్యక్తి. సైన్యం, ఉగ్రవాదుల లక్ష్యమూ అదే. పైకి మాత్రం ఇమ్రాన్‌ భారత్‌తో కశ్మీర్‌ గురించి చర్చిస్తానంటున్నారు. భారత ప్రభుత్వం ఇంతమాత్రానికే ఎగిరి గంతేస్తుందనుకోవడం భ్రమ. పైగా భారత్‌లో వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్నందున పాక్‌ను ఆలింగనం చేసుకోవడానికి దిల్లీ ఇష్టపడదు. దాని దృష్టి అంతా సరిహద్దుల్లో ఉగ్రవాదులను అడ్డగించడం మీదే ఉంటుంది.
తాను ప్రజల పక్షమని నిరూపించుకోవలసిన బాధ్యత ఇమ్రాన్‌పై ఉంది. ప్రస్తుతానికి ఆయన సైన్యం మనిషి అని పాక్‌ ప్రజలు, మిగతా ప్రపంచమూ నమ్ముతున్నారు. ఈ ముద్రను చెరిపేసుకోవడం అంత తేలిక కాదు!

Related posts

Leave a Comment